French Toast : ఫ్రెంచ్ టోస్ట్.. బ్రెడ్, ఎగ్స్ తో చేసే ఈ వంటకం గురించి తెలియని వారుండరని చెప్పవచ్చు. ఫ్రెంచ్ టోస్ట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. విదేశాల్లో దీనిని ఎక్కువగా తింటూ ఉంటారు. మన ఇంట్లో కూడా ఈ ఫ్రెంచ్ టోస్ట్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఫ్రెంచ్ టోస్ట్ ను సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రెంచ్ టోస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
సాండ్ విచ్ బ్రెడ్ స్లైసెస్ – 6, కోడిగుడ్లు – 2, పాలు – పావు కప్పు, ఫ్రెష్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్, బ్రౌన్ షుగర్ – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – చిటికెడు, వెనీలా ఎసెన్స్ – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి – రెండు చిటికెలు, జాజికాయ పొడి – ఒక చిటికెడు, బటర్ – 2 టేబుల్ స్పూన్స్.
ఫ్రెంచ్ టోస్ట్ తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని వాటికి నాలుగు వైపులా నల్లగా ఉండే భాగాన్ని తొలగించాలి. తరువాత వెడల్పుగా ఉండే గిన్నెలో కోడిగుడ్లను వేసుకోవాలి. తరువాత బటర్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద నాన్ స్టిక్ పెన్నాన్ని ఉంచి దానిపై బటర్ ను వేసి వేడి చేయాలి. బటర్ కరిగిన తరువాత బ్రెడ్ స్లైస్ ను తీసుకుని కోడిగుడ్డు మిశ్రమంలో రెండు వైపులా 15 సెకన్ల పాటు నానబెట్టి పెనం మీద వేసుకోవాలి. తరువాత వీటిపై మరికొద్దిగా బటర్ ను వేసి మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఫ్రెంచ్ టోస్ట్ తయారవుతుంది. వీటిని మాపిల్ సిరప్ తో లేదా తేనెతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారు. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్ గా ఇలా ఫ్రెంచ్ టోస్ట్ ను తయారు చేసుకుని తినవచ్చు.