Chicken Lollipop : చికెన్ తో చేసుకోదగిన వివిధ రకాల వంటకాల్లో చికెన్ లాలిపాప్ కూడా ఒకటి. రెస్టారెంట్ లలో దీనిని చాలా మంది రుచి చూసే ఉంటారు. పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా ఉండే ఈ చికెన్ లాలిపాప్ ను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. రెస్టారెంట్ లలో లభించే విధంగా ఉండే ఈ చికెన్ లాలిపాప్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలిపాప్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ లాలిపాప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అర గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ వింగ్స్ – 6, పచ్చిమిర్చి తరుగు – అర టీ స్పూన్, అల్లం తరుగు – ముప్పావు టీ స్పూన్, వెల్లుల్లి తరుగు – అర టీ స్పూన్, ఉల్లి తరుగు – 2 టీ స్పూన్స్, తెల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, నిమ్మరసం – ఒక టీ స్పూన్, చైనీస్ చిల్లీ పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, సోయా సాస్ – పావు టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
చికెన్ లాలిపాప్ తయారీ విధానం..
ముందుగా చికెన్ వింగ్స్ ను తీసుకుని జాయింట్స్ ను చికెన్ ను చాకుతో నెమ్మదిగా పైకి అనుకోవాలి. చికెన్ బోన్ నుండి పూర్తిగా వేరుగా అవ్వకుండా చూసుకోవాలి. ఎక్కువగా ఉండే చికెన్ ను తీసేసి మిగిలిన చికెన్ ను చేత్తో దగ్గరికి వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి చికెన్ వింగ్స్ కు నెమ్మదిగా పట్టించాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న చికెన్ వింగ్స్ ను మరోసారి చేత్తో దగ్గరికి వత్తుకుని నూనెలో వేసుకోవాలి.
వీటిని రెండు నుండి మూడు నిమిషాల పాటు కదిలించకుండా అలాగే వేయించాలి. తరువాత వీటిని అటూ ఇటూ తిప్పుతూ మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత వీటి చివర్లకు సిల్వర్ పేపర్ ఫాయిల్ ను చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అచ్చం రెస్టారెంట్ లలో లభించే విధంగా ఉండే చికెన్ లాలిపాప్స్ తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో రెస్టారెంట్ లకు వెళ్లే పనిలేకుండా ఇలా చికెన్ లాలిపాప్స్ ను ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు.