Paneer Payasam : పనీర్ గురించి అందరికీ తెలిసిందే. దీన్ని పాలతో తయారు చేస్తారు. దీంతో వంటలు చేస్తుంటారు. పలు రకాల మసాలా కూరల్లో వేస్తారు. దీంతో పలు స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. పనీర్ ఎంతో రుచిగా ఉంటుంది. పోషకాలను, శక్తిని అందిస్తుంది. అందువల్ల చాలా మంది దీన్ని తింటుంటారు. అయితే పనీర్ తో ఎంతో రుచికరమైన పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని చేయడం కూడా సులభమే. పనీర్‌తో పాయసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
పనీర్ – 1 కప్పు, చిక్కని పాలు – 1 లీటర్, చక్కెర – పావు కప్పు, బియ్యం పిండి – 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి – 1 టీస్పూన్, డ్రై ఫ్రూట్స్ – గుప్పెడు, కుంకుమ పువ్వు – చిటికెడు, నెయ్యి – 1 టేబుల్ స్పూన్.
పనీర్ పాయసాన్ని తయారు చేసే విధానం..
ముందుగా నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ ను దోరగా వేయించుకోవాలి. తరువాత స్టవ్‌పై ఒక గిన్నెలో పాలను వేసి పాలు బాగా మరిగేదాకా కలియబెడుతూ ఉండాలి. పాలు బాగా మరిగిన తరువాత కుంకుమ పువ్వు, బియ్యపు పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. పది నిమిషాలు బాగా ఉడికిన తరువాత ఈ మిశ్రమంలో ముందుగా వేయించుకున్న కొన్ని డ్రైఫ్రూట్స్, యాలకులపొడి వేసి రెండు నిమిషాల పాటు ఉడికించి తరువాత చక్కెర వేయాలి. చక్కెర వేసిన తరువాత ఈ మిశ్రమం గట్టిపడేవరకు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం గట్టిపడుతున్న క్రమంలో మంటను తగ్గించుకుని పన్నీర్ తురుము వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం వేడి వేడిగా ఉన్న ఈ పాయసంలో మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేయాలి. తరువాత బాగా కలపాలి. అంతే.. ఎంతో రుచికరమైన పనీర్ పాయసం రెడీ అవుతుంది. దీన్ని వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.