Beerakaya Kura : మనం బీరకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. ఇతర కూరగాయల వలె బీరకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, రక్తహీనతను తగ్గించడంలో,కాలేయం పనితీరును మెరుగుపరచడంలో ఇలా అనేక విధాలుగా బీరకాయ మనకు ఉపయోగపడుతుంది. దీనితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బీరకాయలతో కింద చెప్పిన విధంగా చేసే కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ బీరకాయ కూరను తయారు చేయడం కూడా చాలా సులభం. బీరకాయలతో రుచిగా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
బీరకాయలు – అర కిలో, నూనె – 3 టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, నువ్వులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 6, ధనియాలు – 2 టీ స్పూన్స్, మిరియాలు – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 8, చింతపండు – రెండు రెమ్మలు, ఎండు కొబ్బరి పొడి – 2 టీ స్పూన్స్.
బీరకాయ కూర తయారీ విధానం..
ముందుగా బీరకాయలను శుభ్రపరిచి గుండ్రంగా లేదా పొడుగ్గా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో ఎండు కొబ్బరి పొడి తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. ఈ దినుసులన్నీ చల్లారిన తరువాత జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఉప్పు, ఎండుకొబ్బరి పొడి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత బీరకాయ ముక్కలు వేసి కలపాలి.
తరువాత దీనిపై మూత పెట్టి బీరకాయ ముక్కలను మగ్గించాలి. బీరకాయ ముక్కలు పూర్తిగా ఉడికిన తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని కూడా మరో రెండు నిమిషాల పాటు మగ్గించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బీరకాయతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా వండుకుని తినవచ్చు. బీరకాయలంటే ఇష్టంలేని వారు కూడా ఈ విధంగా తయారు చేసిన కూరను ఇష్టంగా తింటారు.