Neem Oil For Hair : జుట్టు రాలడం అనే సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. అలాగే వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, ఆందోళన, తలలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లు వంటి వాటిని ఈ జుట్టు రాలడానికి కారణాలుగా చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఈ సమస్య నుండి బయటపడడానికి రసాయనాలు కలిగిన షాంపులను వాడడానికి బదులుగా మన ఇంట్లోనే వేప నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల మనం ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.
వేప నూనె కుదుళ్లకు బలాన్ని చేకూర్చడంతో పాటు చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. అలాగే ఈ నూనెను వాడడం వల్ల జుట్టు కాంతివంతంగా తయారవుతుంది. వేప నూనెను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే ఈ నూనెను ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను తయారు చేసుకోవడానికి గానూ మనం వేప ఆకులను, కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా వేప ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తరువాత కళాయిలో కొబ్బరి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆరబెట్టుకున్న వేపాకులను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై నల్లగా అయ్యే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత ఈ నూనెను పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. నూనె చల్లారిన తరువాత ఒక వస్త్రంలో వేయించిన ఆకులన్నింటిని తీసుకుని వీలైనంత గట్టిగా పిండుతూ నూనెను గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వేప నూనెను గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పట్టించి మర్దనా చేయాలి. ఈ నూనెను రెండు గంటల పాటు జుట్టుకు పట్టించి అలాగే ఉంచాలి. రెండు గంటల తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడాన్ని మనం చాలా తేలికగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను పాటించడం జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే జుట్టు పట్టులా తయారవుతుంది. ఈ చిట్కాను ఎవరైనా వాడవచ్చు. చుండ్రు సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.