Bendakaya Fry : బెండకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికి తెలిసిందే. బెండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బెండకాయలతో చేసిన వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బెండకాయలతో ఎక్కువగా చేసే వంటకాల్లో బెండకాయ వేపుడు ఒకటి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. తరచూ చేసే బెండకాయ ఫ్రై కంటే కింద చెప్పిన విధంగా చేసే బెండకాయ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ బెండకాయ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
బెండకాయలు – అర కిలో, నూనె – 5 టీ స్పూన్స్, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 2, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్.
కొబ్బరి పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుకొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, పుట్నాల పప్పు – 2 టీ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 4.
బెండకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వీటిని ముక్కలుగా చేసుకుని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు జార్ లో ఎండుకొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత బెండకాయ ముక్కలు వేసి కలపాలి. వీటిని నెమ్మదిగా కలుపుతూ కరకరలాడే వరకు వేయించుకోవాలి.
బెండకాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత ఉప్పు, కారం, మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని రెండు టీ స్పూన్ ల మోతాదులో వేసుకుని అంతా కలిసేలా బాగా కలపాలి. దీనిని మరో మూడు నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బెండకాయలతో ఈ విధంగా తయారు చేసిన ఫ్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బెండకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా వేపుడును కూడా తయారు చేసుకుని తినవచ్చు.