Coriander Leaves : కొత్తిమీర.. ఇది మనందరికి తెలిసిందే. మనం చేసే వంటలను గార్నిష్ చేయడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కొత్తిమీర వేయడం వల్ల వంటల రుచి, వాసన పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వంటల రుచి పెంచడంతో పాటు కొత్తిమీర మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, థయామిన్, నియాసిన్, ఫైబర్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. కొత్తిమీరను వాడడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొత్తిమీరను ఉపయోగించడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
శరీరంలో ఉండే మలినాలు తొలగిపోతా. కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే ఎముకలను ఆరోగ్యంగా, ధృడంగా ఉంచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, డయేరియాను తగ్గించడంలో కూడా కొత్తిమీర మనకు సహాయపడుతుంది. రక్తహీనతను తగ్గించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, నోటిలో అల్సర్లను తగ్గించడంలో కూడా కొత్తిమీర మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మ సంబంధిత సమస్యలను తగ్గించే గుణం కూడా కొత్తిమీరకు ఉంది. అలాగే జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు కొత్తిమీరను వాడడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. అదే విధంగా జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, అల్జీమర్స్ వంటి సమస్యల బారిన పడకుండా చేయడంలో కూడా కొత్తిమీర మనకు దోహదపడుతుంది. కొత్తిమీరను వాడడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
స్త్రీలల్లో వచ్చే నెలసరి సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా కొత్తిమీర మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వంటల్లో వాడడంతో పాటు జ్యూస్ గా కూడా చేసుకుని తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే మనకు ఈ కొత్తిమీర ఎండాకాలంలో ఎక్కువగా లభించదు. కనుక కొత్తిమీర ఎక్కువగా దొరికినప్పుడు దానిని ఎక్కువ మొత్తంలో తీసుకుని శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి. తరువాత దీనిని పొడిగా చేసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న కొత్తిమీర పొడిని వంటల్లో ఉపయోగించవచ్చు. అలాగే చాలా మంది పిల్లలు కొత్తిమీరను తినడానికి ఇష్టపడరు. వంటల్లో దానిని వేసినప్పటికి తీసి పక్కకు పెడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇలా కొత్తిమీరను పొడిగా చేసి వంటల్లో వేయడం వల్ల రుచితో పాటు కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలను అందించవచ్చు. ఈ విధంగా కొత్తిమీర మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని తప్పకుండా ఆహారంగా భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.