Aloo Rice : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ బంగాళాదుంపలను తినడానికి ఇష్టపడతారు. ఈ బంగాళాదుంపలతో తరచూ చేసే వంటకాలే కాకుండా దీనితో మనం ఎంతో రుచిగా ఉండే రైస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. తినగా మిగిలిన అన్నంతో కూడా ఈ వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఆలూ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – ఒక కప్పు బియ్యంతో వండినంత, తరిగిన బంగాళాదుంపలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), కొత్తిమీర – ఒక కట్ట, పుదీనా – ఒక కట్ట, పెరుగు – 3 టీ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 5, పచ్చిమిర్చి – 3, అల్లం – అర ఇంచు ముక్క, నిమ్మకాయ – అర చెక్క, ఉప్పు – తగినంత, నూనె -3 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన టమాట – 1, కారం – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్.
ఆలూ రైస్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో కొత్తిమీర, పుదీనా, పెరుగు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, నిమ్మరసం, ఉప్పు, పచ్చిమిర్చి వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు కలుపుతూ వేయించాలి. బంగాళాదుంప ముక్కలు వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి అవి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత కారం, జీలకర్ర పొడి వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి.
దీనిని నీరంతా ఇగిరి పోయి దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత అన్నం వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు పెద్ద మంటపై బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ రైస్ తయారవుతుంది. వంట చేయడానికి సమయం లేనప్పుడు, లంచ్ బాక్స్ ల్లోకి, వీకెండ్స్ లో ఇలా ఆలూ రైస్ తయారు చేసుకుని తినవచ్చు. దీనిని విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.