Rajma Masala : ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో రాజ్మా కూడా ఒకటి. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రాజ్మాను రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రాజ్మాతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా ధాబా స్టైల్ లో రాజ్మా మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ధాబా స్టైల్ రాజ్మా మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
రాత్రంతా నానబెట్టిన రాజ్మా – ఒక కప్పు, నీళ్లు – ముప్పావు లీటర్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 5, నూనె – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కాశ్మీరీ చిల్లీ పౌడర్ – ఒక టీ స్పూన్, నెయ్యి – పావు కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్ చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, టమాటాలు – 3, కారం – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – అర కట్ట.
ధాబా స్టైల్ రాజ్మా మసాలా తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో రాజ్మా, ఉప్పు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, నీళ్లు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లం పేస్ట్, నూనె వేసి మూత పెట్టాలి. ఈ రాజ్మాను మధ్యస్థ మంటపై 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి , ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి. తరువాత 50 ఎమ్ ఎల్ నీళ్లు పోసి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
తరువాత టమాటాలను ఫ్యూరీగా చేసుకోవాలి. తరువాత నూనె పైకి తేలే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత ఉడికించిన రాజ్మాను నీళ్లతో సహా వేసుకుని కలపాలి. తరువాత దీనిని మధ్యస్థ మంటపై 15 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాజ్మా మసాలా తయారవుతుంది. దీనిని రోటీ, చపాతీ, పుల్కా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. రాజ్మాతో ఈ విధంగా మసాలా కూరను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.