Folic Acid : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో ఫోలిక్ యాసిడ్ ఒకటి. ఇది బి కాంప్లెక్స్ విటమిన్స్ కు చెందిన విటమిన్స్ లో ఒకటి. ఈ విటమిన్ కూడా నీటలో కరుగుతుంది. మన శరీరంలో రక్తకణాల ఉత్పత్తికి అతి ముఖ్యంగా అవసరమయ్యే వాటిలో ఫోలిక్ యాసిడ్ ఒకటి. ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉంటే రక్తం ఎక్కువగా ఉత్పత్తి కాదు. దీనిని మనం ఆహారం ద్వారా ఏ రోజుకు ఆ రోజు శరీరానికి తప్పకుండా అందించాల్సిందే. శరీరంలో ఫోలిక్ యాసిడ్ నిల్వ ఉండదు. శరీరానికి తగినంత ఫోలిక్ యాసిడ్ అందకపోవడం వల్ల మనం అనేక సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఫోలిక్ యాసిడ్ ను శరీరానికి తగినంత అందించడం వల్ల మనం పది ముఖ్యమైన లాభాలను పొందవచ్చు. మనకు ఒక రోజుకు 400 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ అవసరమవుతుంది.
గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు 800 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ అవసరమవుతుంది. మన శరీరంలో కొత్త కణాల ఉత్పత్తిలో, డి ఎన్ ఎ తయారీలో ఫోలిక్ యాసిడ్ అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మన శరీరంలో రోజు కోట్ల కణాలు నశిస్తూ ఉంటాయి. వాటి స్థానంలో కొత్త కణాలు తయారవ్వాలంటే ఫోలిక్ యాసిడ్ తగిన మోతాదులో ఉండడం చాలా అవసరం. అలాగే గర్భిణీ స్త్రీలల్లో పిండం ఎదుగుదలకు, అవయవాల నిర్మాణంలో, నాడీ మండల వ్యవస్థ నిర్మాణంలో ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. కనుక గర్భిణీ స్త్రీలు తప్పకుండా ఫోలిక్ యాసిడ్ కు సంబంధించిన మందులు వేసుకుంటూ ఉండాలి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఫోలిక్ యాసిడ్ మనకు ఉపయోగపడుతుంది. అదే విధంగా కాలేయంలోని వ్యర్థాలను తొలగించడంలో కొన్ని పోషకాలు చాలా అవసరం.
ఇలా అవసరమయ్యే అతి ముఖ్యమైన పోషకాల్లో ఫోలిక్ యాసిడ్ ఒకటి. తగినంత ఫోలిక్ యాసిడ్ లభించడం వల్ల కాలేయం వ్యర్థాలను మూడు దశల్లో బయటకు పంపించడంతో పాటు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మన శరీరంలో హోమోసిస్టిన్ అనే ఎమైనో యాసిడ్ తయారవుతుంది. ఈ ఎమైనో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. హోమోసిస్టిన్ అనే ఎమైనో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వకుండా చేయడంలో ఫోలిక్ యాసిడ్ మనకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే మనం ప్రతిరోజూ ఏ పని చేయాలన్నా కండరాలు ఆరోగ్యంగా, ఉత్తేజంగా ఉండాలి. కండరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా వాటిలో సాగే గుణం చక్కగా ఉండాలన్నా తగినంత ఫోలిక్ యాసిడ్ ఉండడం చాలా అవసరం. అదే విధంగా మన కంటి చూపు సరిగ్గా ఉండేలా చేయడంలో కూడా ఫోలిక్ యాసిడ్ మనకు సహాయపడుతుంది.
వయసు పెరిగినప్పటికి మన అవయవాలు చక్కగా పని చేయడంలో, వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా చేయడంలో శరీరానికి ఫోలిక్ యాసిడ్ మనకు సహకరిస్తుంది. క్యాన్సర్ కణాలు మన శరీరంలో తయారవ్వకుండా, క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందకుండా అలాగే ఆరోగ్యవంతమైన కణాలు క్యాన్సర్ కణాల లాగా మారకుండా చేయడంలో ఫోలిక్ యాసిడ్ దోహదపడుతుంది. డిఫ్రెషన్ రాకుండా, మానసికంగా స్థిరంగా ఉండేలా చేయడంలో కూడా ఫోలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. ఈ లాభాలను మనం పొందాలంటే మన శరీరానికి ప్రతిరోజూ ఫోలిక్ యాసిడ్ ను అందించడం చాలా అవసరం. ఈ ఫోలిక్ యాసిడ్ విత్తనాలకు, ధాన్యాలకు ఉండే పై పొరల్లో అధికంగా ఉంటుంది. కానీ ఈ ధాన్యాలను మనం పాలిష్ పట్టి తీసుకుంటున్నాము కనుక ధాన్యాలను తీసుకున్నప్పటికి మన శరీరానికి తగినంత ఫోలిక్ యాసిడ్ లభించదు.
ధాన్యాలను పాలిష్ పట్టగా వచ్చే తవుడులో ఈ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. తవుడును తినడం వల్ల కూడా మనకు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా అందే అవకాశం ఉంది. అలాగే పెసర్లు, అలసందలు, ఎర్ర శనగల్లో కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. వీటిని మొలకెత్తించి తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. అలాగే పుదీనాలో కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా పండ్లల్లో కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ ఆహారాలను మనం తీసుకోవడం వల్ల అలాగే పాలిష్ పట్టని ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ ను అందించవచ్చని అలాగే ఫోలిక్ యాసిడ్ వల్ల కలిగే లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.