Tomato Paneer Masala Curry : మనలో చాలా మంది పన్నీర్ తో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. పన్నీర్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పన్నీర్ తో చేసుకోదగిన వంటకాల్లో టమాట పన్నీర్ మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే టమాట పన్నీర్ మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పన్నీర్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, పెద్ద ముక్కలుగా తరిగిన టమాటాలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, టమాటాలు – 3, నీళ్లు – 150 ఎమ్ ఎల్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, పన్నీర్ ముక్కలు – పావు కిలో, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, సన్నగా పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 4, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ఖర్బూజ గింజలు – 2 టీ స్పూన్స్, ఎండు కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్.
టమాట పన్నీర్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు సగానికి పైగా వేగిన తరువాత పచ్చిమిర్చి, పల్లీలు, కర్బూజ గింజలు వేసి వేయించాలి. తరువాత ఎండు కొబ్బరి పొడి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని పలుకు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక టమాట ముక్కలను వేసి మెత్తగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో అల్లం పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు మాడిపోకుడా వేయించాలి. తరువాత టమాటాలను ఫ్యూరీగా చేసి వేసుకుని కలపాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, నెయ్యి, నీళ్లు పోసి బాగా కలపాలి. తరువాత దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత పన్నీర్ ముక్కలు, వేయించిన టమాట ముక్కలు వేసి కలిపి చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట పన్నీర్ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పులావ్ ఇలా దేనితోనైనా కలిపి తినవచ్చు. పన్నీర్ తో తరచూ చేసే కూరలతో పాటు అప్పుడప్పుడూ ఇలా టమాట పన్నీర్ మసాలా కర్రీని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పన్నీర్ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.