Touch Me Not Plant : గ్రామాల్లో, పొలాల దగ్గర, నీటి తడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెరిగి వివిధ రకాల మొక్కలల్లో అత్తిపత్తి మొక్క కూడా ఒకటి. ఈ మొక్క గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ మొక్క ముట్టుకోగానే ఆకులన్నీ ముడుచుకుపోయి కొద్ది సమయం తరువాత వాటంతట అవే మళ్లీ విచ్చుకుంటాయి. ఈ మొక్క జానేడు నుండి మూరెడు ఎత్తు వరకు పెరుగుతుంది. ఆకులు తుమ్మాకుల్లాగా చిన్నగా ఉంటాయి. అత్తిపత్తి మొక్కను సంస్కృతంలో లజ్జాళు అని, హిందీలో లాజోంతి అని, తెలుగులో నిద్రగన్నిక, నీసిగ్గుచితక వంటి పేర్లతో పిలుస్తారు. చాలా మంది ఈ మొక్క ఎందుకు పనికి రాదు అనుకుంటారు కానీ దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క ప్రతి భాగం కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అత్తిపత్తి మొక్క వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. దీనిని ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాతాన్ని తగ్గించడంలో, రక్తాన్ని శుద్ది చేయడంలో, వ్రణాలను మానేలా చేయడంలో, బోదకాలు, గుండె దడ, కామెర్లు వంటి వివిధ రోగాలను నయం చేయడంలో అత్తిపత్తి మొక్క మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అత్తిపత్తి గింజలు, చింతగింజలపప్పు, నీరుగొబ్బి గింజలను సమానంగా తీసుకుని రాత్రంతా మర్రిపాలల్లో నానబెట్టాలి. తరువాత గాలికి ఆరబెట్టి మెత్తగా నూరి శనగింజలంత మాత్రలుగా చేసి ఎండబెట్టాలి. తరువాత వీటిని నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రలను పూటకు మూడు చొప్పున రెండు పూటలా తీసుకోవాలి. తరువాత నాటు ఆవుపాలల్లో కండచక్కెర కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల పురుషుల్లో వచ్చే శీఘ్రస్కలనం, నపుంసకత్వం, అంగబలహీనత, మూత్రం నుండి వీర్యంపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. అత్తిపత్తిఆకులను మెత్తగా నూరి నారికురుపులపై వేసి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల కురుపులు నశించిపోతాయి.
అత్తిపత్తి ఆకు పొడి ఒక భాగం, పటికబెల్లం పొడి రెండు భాగాలుకలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పూటకు అర చెంచా మోతాదులో మంచి నీటితో తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల స్త్రీలల్లో ఆగిన బహిష్టు వస్తుంది. బహిష్టు రాగానే చూర్ణాన్ని తీసుకోవడం ఆపివేయాలి. అత్తిపత్తి వేర్లను మేకపాలతో లేదా గొర్రెపాలతో నూరాలి. వచ్చిన గంధాన్ని పురుషులు తమ అరికాళ్లకు రాసుకుని ఆ తరువాత రతిలో పాల్గొంటే చాలా సేపటి వరకు వీర్యపతనం కాకుండా ఉంటుంది. అలాగే అత్తిపత్తి ఆకు 5 గ్రాములు, 9 మిరియాలను ఒక గ్లాస్ నీటితో కలిపి మెత్తగా నూరాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వస్త్రంతో వడకట్టి పరగడుపున 40 రోజుల పాటు తాగాలి. తరువాత అత్తిపత్తి ఆకును మెత్తగా నూరి బోధకాలుపై ఉంచి కట్టుకట్టాలి. ఈ విధంగా అత్తిపత్తి ఆకును ఉపయోగించుకోవడం వల్ల బోధకాలు సమస్య నుండి బయటపడవచ్చు.
అత్తిపత్తి ఆకును తేనెతో మెత్తగా నూరాలి. తరువాత ఈ మిశ్రమాన్ని స్త్రీలు తమ యోనికి పట్టిస్తూ ఉంటే యోని బిగుతుగా అవుతుంది. అలాగే అత్తిపత్తి సమూల చూర్ణం, అశ్వగంధ దుంపల చూర్ణం సమానంగా కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడికి నీటిని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను రాత్రి పడుకునే ముందు స్థనాలకు పట్టించి ఉదయాన్నే కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల జారిన స్థనాలు బిగుతుగా తయారవుతాయి. నీళ్ల విరేచనాలు, రక్తమొలలతో బాధపడే వారు అత్తిపత్తి సమూల చూర్ణాన్ని 3 నుండి 5 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ పంచదారను కలిపి రెండు పూటలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల విరేచనాలు, రక్తమొలలు తగ్గుతాయి. పచ్చని పూలు పూసే అత్తిపత్తిచెట్టు కాడలను, తాటికలకండను సమానంగా కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని కంకుడు గింజలంత మాత్రలు చేసి గాలిలో నీడకు బాగా ఆరబెట్టాలి. ఈ మాత్రలను పూటకు ఒకటి చొప్పున రెండు పూటలా మర్రిచెక్క కషాయంతో తీసుకుంటే అతిమూత్రం హరిస్తుంది.
అత్తిపత్తి ఆకులను మెత్తగా నూరి అందులో పసుపు కలిపి కురుపులు, పుండ్లు, వ్రణాలపై కడుతూ ఉంటే క్రమంగా వ్రణాలు, పుండ్లు తగ్గుతాయి. అత్తిపత్తి చెట్టును సమూలంగా ఒక కేజీ పరిమాణంలో తీసుకుని దంచాలి. దీనికి 4 కేజీల నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. దీనిని ఉదయాన్నే పొయ్యి మీద ఒక కేజీ కషాయం మిగిలే వరకు మరిగించాలి. ఈ కషాయానికి కేజీ నువ్వుల నూనెను కలిపి తైలం మిగిలే వరకు మరగబెట్టాలి. ఇలా తయారు చేసుకున్న నూనెతో దీపాన్ని వెలిగించి దానిపై మంట తగిలేలా మట్టి మూకుడును కానీ, రాగి పళ్లాన్ని కానీ ఉంచాలి. తరువాత ఆ మసిని తీసి తగినంత ఆవు నెయ్యి కలిపితే కాటుక అవుతుంది. ఈ కాటుకను రోజూ రాత్రి కళ్లకు పెట్టుకుంటే పొరలు, పూతలు తగ్గుతాయి. ఈ విధంగా అత్తిపత్తి మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ఉపయోగించి మనం అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.