మన శరీరంలో అవయవాలకు కావల్సిన పోషకాలు, శక్తి, ఆక్సిజన్‌లను మోసుకుపోయేది రక్తం. అనంతరం ఆయా అవయవాలు, కణజాలాల నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, ఇతర వ్యర్థాలను కూడా రక్తం మోసుకెళ్తుంది. అనంతరం అది ఫిల్టర్ అవుతుంది. అయితే నోట్లో ఊరే ఉమ్మి (Saliva) ఇందుకు భిన్నమైంది. ఈ క్రమంలో కొందరు ఉమ్మిని మింగకుండా పదే పదే బయటకు ఊస్తుంటారు. ఇంకా కొన్ని సందర్భాల్లోనైతే గాయాల వంటివి అయినప్పుడు వచ్చే రక్తాన్ని నోట్లోకి పీల్చుకుంటారు కొందరు. అయితే అసలు ఉమ్మి, రక్తంలలో దేన్ని లోపలికి తీసుకోవాలి..? దేంతో మనకు హాని కలుగుతుంది..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఎవరికైనా నోట్లో లాలాజలం లేదా ఉమ్మి ఊరుతుంది. అయితే దీన్ని కొందరు మింగకుండా బయటకు ఊసేస్తుంటారు. ఉదయం పూట పళ్లు తోమక ముందు వచ్చే లాలాజలాన్ని ఊసేయాల్సిందే. కానీ కొందరు మాత్రం అలా కాక పొద్దస్తమానం ఉమ్మి ఊసేస్తుంటారు. అయితే అలా చేయకూడదు. ఉదయం వచ్చే ఉమ్మి తప్ప రోజు మొత్తంలో ఎప్పుడు ఉమ్మి వచ్చినా మింగాలి. ఎందుకంటే అందులో మన జీర్ణాశయానికి కావల్సిన పలు ఎంజైమ్‌లు ఉంటాయి. అవి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. అందుకు ఉమ్మిని మనం మింగాల్సిందే. అయితే కఫం వస్తుంటే మాత్రం ఉమ్మిని మింగకపోవడమే మంచిది.
ఇక రక్తం విషయానికి వస్తే కొందరు చేతి వేళ్లకు గాయాలై రక్తం కారుతున్నప్పుడు దాన్ని అలాగే నోట్లో పెట్టుకుని రక్తం పీలుస్తారు. ఆ క్రమంలో కొత్త మొత్తంలో రక్తం మన జీర్ణాశయంలోకి వెళ్తుంది. అయితే అంత చిన్న మొత్తం రక్తానికి ఏమీ కాదు కానీ, పెద్ద మొత్తంలో రక్తం లోపలికి పోరాదు. ఎందుకంటే రక్తంలో స్టెర్‌కొబిలినోజెన్ అనబడే డార్క్ బ్రౌన్ పిగ్మెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తంలో ఉండే వ్యర్థ పదార్థం. కనుక రక్తం మన జీర్ణాశయంలోకి వెళ్లినప్పుడు ఈ పిగ్మెంట్ కూడా రక్తంలో ఉంటుంది కాబట్టి అది కూడా జీర్ణాశయంలోకి వస్తుంది. దాంతో జీర్ణాశయం ఆ వ్యర్థాన్ని జీర్ణం చేయదు. దీనికి తోడు ఆ వ్యర్థం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక గాయాలైనప్పుడు రక్తాన్ని లోపలికి పీల్చకుండా ఉండడమే ఉత్తమం.