Cabbage Egg Bhurji : మనం క్యాబేజిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యాబేజితో చేసే కూరలు రుచిగా ఉంటాయి. క్యాబేజితో చేసే కూరలు తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. క్యాబేజితో చేసే వివిధ రకాల కూరలల్లో క్యాబేజ్ ఎగ్ బుర్జి కూడా ఒకటి. క్యాబేజి, కోడిగుడ్లు కలిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎవరైనా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే క్యాబేజ్ ఎగ్ బుర్జిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజ్ ఎగ్ బుర్జి తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాబేజి – 1 ( మధ్యస్థంగా ఉన్నది), నూనె – 1/3 కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, కోడిగుడ్లు – 3, గరం మసాలా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
క్యాబేజి ఎగ్ బుర్జి తయారీ విధానం..
ముందుగా క్యాబేజిని తరిగి ఉప్పు నీటిలో వేసి బాగా కడగాలి. తరువాత క్యాబేజిని తరుగును వడకట్టి 15 నిమిషాల పాటు ఆరబెట్టాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం, ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసి కలపాలి. మసాలాలు బాగా వేగిన తరువాత క్యాబేజి తురుము వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి క్యాబేజిని చక్కగా వేయించాలి. క్యాబేజి వేగిన తరువాత మూత తీసి మంటను పెద్దగా చేసి క్యాబేజి పొడిపొడిగా అయ్యే వరకు వేయించాలి. తరువాత మంటను చిన్నగా చేసి కోడిగుడ్లు వేసుకోవాలి.
తరువాత వాటిని కదపకుండా మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మూత తీసి అంతా కలిసేలా కలుపుతూ మరో 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి ఎగ్ బుర్జి తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యాబేజిని తినని వారు కూడా ఈ కూరను ఎంతో ఇష్టంగా తింటారు.