Vankaya Dosakaya Pachadi : వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. వంకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో చేసుకోదగిన వంటకాల్లో వంకాయ పచ్చడి కూడా ఒకటి. వంకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మనం అప్పుడప్పుడూ ఈ పచ్చడిని తయారు చేస్తూనే ఉంటాం. ఈ వంకాయ పచ్చడిలో మనం దోసకాయలు వేసి ఈ పచ్చడిని మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. వంకాయ దోసకాయ చట్నీని ఎక్కువగా పెళ్లిళ్లల్లో వడిస్తూ ఉంటారు. ఈ పచ్చడిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ వంకాయ దోసకాయ చట్నీని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ దోసకాయ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన వంకాయలు – పావు కిలో, తరిగిన దోసకాయ – 200 గ్రా., టమాట – 1, పచ్చిమిర్చి – 10, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 5, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర – గుప్పెడు.
వంకాయ దోసకాయ చట్నీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. పల్లీలను దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు వేసి వేయించాలి. వంకాయ ముక్కలు చక్కగా వేగి మెత్తబడిన తరువాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో టమాట ముక్కలు వేసి వేయించాలి. టమాట ముక్కలు చక్కగా వేగిన తరువాత అందులో కొత్తిమీర వేసి వేయించాలి. కొత్తిమీర మెత్తబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఒక జార్ లో వేయించిన పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన వంకాయలు, టమాట, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ దోసకాయ చట్నీ తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయలు, దోసకాయలతో విడివిడిగా చేసే పచ్చడితో పాటు ఈ రెండింటిని కలిపి ఈ విధంగా కూడా పచ్చడిని తయారు చేసుకోవచ్చు. వంకాయ, దోసకాయ చట్నీని అందరూ లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.