Methi Paratha : మనం మెంతికూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలోబరువు తగ్గడంలో ఇలా అనేక రకాలుగా మెంతికూర మనకు ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మెంతికూరతో మనం ఎంతో రుచిగా ఉండే పరాటాలను కూడా తయారు చేసుకోవచ్చు. మెంతికూరతో చేసే ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, సులువుగా మేథీ పరాటాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేథీ పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒకటిన్నర కప్పు, శనగపిండి – అర కప్పు, చిన్నగా తరిగిన మెంతికూర – ఒక పెద్ద కట్ట, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, ఉప్పు – తగినంత, అల్లం తరుగు – అర టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూన్, పసుపు – రెండు చిటికెలు, గరం మసాలా – అర టీ స్పూన్, నూనె – ఒక టీ స్పూన్.
మేథీ పరాటా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత పిండిని ఉండలుగా చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిపై వస్త్రాన్ని కప్పి అరగంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం బాగా వేడయ్యాక పరాటాను వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత నూనె, నెయ్యి లేదా బటర్ వేసుకుంటూ రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మేథీ పరాటా తయారవుతుంది. దీనిని ఆవకాయ, పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ ల్లోకి, అల్పాహారంగా అలాగే డిన్నర్ లోకి కూడా ఇలా మేథీ పరాటాలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా మేథీ పరాటాలను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.