Tava Powder : మనం వంటింట్లో రకరకాల పొడులను తయారు చేస్తూ ఉంటాం. కారం పొడులు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ కారం పొడులను ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా చేసుకోదగిన పొడులల్లో తవా పౌడర్ కూడా ఒకటి. ఈ పౌడర్ తో మనం తవా ఇడ్లీ, తవా దోశ వంటి వాటిని తయారు చేసుకోవచ్చు. ఈ పౌడర్ ను తయారు చేయడం చాలా సులభం. దీనిని అన్నంతో కూడా తినవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే తవా పౌడర్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తవా పౌడర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – పావు కప్పు, మినపప్పు – పావు కప్పు, పుట్నాల పప్పు – పావు కప్పు, ఎండుమిర్చి – 10 లేదా తగినన్ని, ఎండుకొబ్బరి పొడి – పావు కప్పు, కరివేపాకు – రెండు రెమ్మలు, ఇంగువ – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత.
తవా పౌడర్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత పుట్నాల పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. చివరగా ఎండు కొబ్బరి పొడి, ఇంగువ వేసి వేయించి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత ఈ పదార్థాలన్నింటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తవా పౌడర్ తయారవుతుంది. దీనిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పొడిని వేడి వేడి అన్నం నెయ్యితో కలిపి తినడంతో పాటు దీనితో తవా ఇడ్లీ, తవా దోశ, తవా గారెలు వంటి వాటిని కూడా తయారు చేసుకోవచ్చు.