Gongura Pickle : గోంగూర పచ్చడి.. ఇది ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. గోంగూర పచ్చడి రుచిగా ఉండడంతో పాటు దీనిని తినడం వల్ల మనం ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మనం ఎక్కువగా ఈ గోంగూర పచ్చడిని పచ్చికారం వేసి చేస్తూ ఉంటాం. కేవలం పచ్చికారమే కాకుండా ఎండుమిర్చి వేసి కూడా మనం గోంగూర పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసి చేసే ఈ గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ పచ్చడిని ఎక్కువగా పెళ్లిళ్లల్లో, ఫంక్షన్స్ లో వడిస్తూ ఉంటారు. ఎండుమిర్చి వేసి గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంగూర – రెండు కట్టలు, ఎండుమిర్చి – 50 గ్రా., ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 20, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, చింతపండు – 3 రెమ్మలు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కరివేపాకు – రెండు రెమ్మలు.
గోంగూర పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. వీటిని చిన్న మంటపై చక్కగా వేయించిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో చింతపండు, గోంగూర వేసి వేయించాలి. గోంగూర పూర్తిగా వేగి దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత జార్ లో వేయించిన ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అదే జార్ లో వేయించిన గోంగూర తగినన్ని వేడి నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నం నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గోంగూరతో తరచూ చేసే పచ్చడితో అప్పుడప్పుడూ ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసి కూడా పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఎండు మిర్చి వేసి చేసిన ఈ పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.