ఐఐటీ బాంబేలో చదువుకోవడం లక్షలాది మంది విద్యార్థులకు ఒక కల. అక్కడ సీటు పొంది చదువుకుంటే కెరీర్‌లో తిరుగుండదని భావిస్తుంటారు. కలలు కనడమే కాదు సీటు కూడా సాధించి అక్కడ చదువుకుంటున్న ఓ విద్యార్థి తన ఐఐటీ బాంబే క్యాంపస్ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఎక్స్ వేదికగా అతడి పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. విజేంద్ర కుమార్ వైశ్య అనే విద్యార్థి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్ చదివేందుకు క్యాంపస్‌లో చేరిన ఒక నెల తర్వాత టెక్ నెర్డ్స్ ప్యారడైజ్ అనే క్యాప్షన్‌తో తన అనుభవాన్ని పంచుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్‌మెంట్ వాతావరణం అద్భుతంగా ఉంటుందని ప్రశంసించాడు. ఎల్లప్పుడూ ల్యాప్‌టాప్‌లపై పనిచేసే తోటి విద్యార్థులతో గడపడం, వారితో కాఫీ ఆస్వాదించడం చాలా బాగుంటుందని విజేంద్ర కుమార్ చెప్పాడు.
సీఎస్ఈ డిపార్ట్‌మెంట్ టెక్ మేధావులకు స్వర్గం లాంటిదని అభివర్ణించాడు. ల్యాప్‌టాప్‌లు పట్టుకునే ఉండే విద్యార్థులు, సేదదీరడానికి చిల్ స్పాట్స్‌లు కనిపిస్తాయని అతడు చెప్పాడు. ల్యాబ్‌లో సహాయక సిబ్బంది, సంప్రదించడానికి సీనియర్లు కూడా ఉంటారంటూ అందరినీ అతడు అభినందించాడు. ల్యాబ్ సిబ్బంది చాలా మంచిగా ఉంటారు. ఏ ప్రశ్నైనా అడగవచ్చు. సీనియర్లు కూడా ఏ టైమ్ అయినా సరే సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారు అసలు కోపం తెచ్చుకోరు.. అంటూ విజేంద్ర కుమార్ రాసుకొచ్చాడు. ఇక విద్యార్థుల హాస్టల్ రూమ్‌లు హాయిగా ఉంటాయని అతడు అభివర్ణించాడు. అయితే తాను అర్ధరాత్రి వరకు చదువుతూనే ఉంటానని, సీఎస్ఈ విభాగం 24 గంటలూ తెరిచే ఉంటుందని విజేంద్ర కుమార్ వివరించారు. క్యాంపస్‌లో ప్రధానంగా ఒక పెద్ద స్టడీ హాల్ ఉంటుందని పంచుకున్నాడు.
ఇక క్యాంపస్ జీవితంలో హాస్టల్‌లో ఎలాంటి ఆంక్షలు లేకపోవడం ఒక అద్భుతమని అతడు పేర్కొన్నారు. హాస్టల్‌లో కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఏమీ ఉండదు. కనీసం అమ్మాయిల హాస్టల్స్‌కు కూడా తాళాలు వేయరు. మీరు చదివేదంతా నిజమే అని పోస్టులో అతడు పేర్కొన్నాడు. ఇక క్లాస్‌లను వారంలో రెండు రోజులు మాత్రమే షెడ్యూల్ చేస్తారని, ఇతర పనులు చేసుకోవడానికి తనకు చాలా సమయం ఉంటోందని రాజేంద్ర కుమార్ వివరించాడు. హాస్టల్‌లో ఆహారాన్ని 24 గంటలపాటు ఆర్డర్ చేసుకునే సౌకర్యం ఉంటుందని చెప్పాడు. విద్యార్థుల జీవితాల్లో ల్యాబ్‌లు, అసైన్‌మెంట్లు, ఈవెంట్లతో కొత్త ప్రేమ వ్యవహారం మొదలవుతుంది. చాలా బిజీ అయిపోతారు అని చమత్కరించాడు. జిమ్, హాస్పిటల్, టెన్నిస్ కోర్టులు, స్విమ్మింగ్ పూల్‌తో పాటు క్యాంపస్ సౌకర్యాలు అన్నింటినీ అతడు తన పోస్టులో హైలైట్ చేశాడు. చదువుకోకుంటే ఏదో పనిచేస్తూనో లేదా ఈత కొడుతుంటారని రాజేంద్ర కుమార్ వివరించాడు.