Pudina Coconut Pulao : పుదీనాను మనం వంటల్లో విరివిరిగా వాడుతూ ఉంటాం. పుదీనా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. వంటల రుచిని పెంచడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా పుదీనా ఎంతో మేలు చేస్తుంది. వంటల్లో వాడడంతో పాటు పుదీనాతో మనం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా తయారు చేయవచ్చు. కొబ్బరి పాలు, పుదీనాతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. కేవలం అర గంట సమయంలోనే దీనిని తయారు చేసుకోవచ్చు. ఎవరైనా దీనిని తేలికగా తయారు చేయడవచ్చు. కమ్మగా, రుచిగా ఉండే పుదీనా కొకోనట్ పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా కొకోనట్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అల్లం – అర ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6, పుదీనా కట్ట – 1 ( మధ్యస్థంగా ఉన్నది), కొత్తిమీర కట్ట – 1 ( మధ్యస్థంగా ఉన్నది), పచ్చిమిర్చి – 5, నెయ్యి – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, మరాఠీ మొగ్గ – 1, అనాస పువ్వు – 1, జాపత్రి – కొద్దిగా, సాజీరా – ఒక టీ స్పూన్, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, బంగాళాదుంప ముక్కలు – పావు కప్పు, తరిగిన టమాట – 1, క్యారెట్ ముక్కలు – పావు కప్పు, తరిగిన ఫ్రెంచ్ బీన్స్ – 4, బఠాణీ – పావు కప్పుగంట పాటు నానబెట్టిన బాస్మతి బియ్యం – ఒక కప్పు, కొబ్బరి పాలు – అర కప్పు, వేడి నీళ్లు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పుదీనా కొకోనట్ పులావ్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో అల్లం, వెల్లుల్లి. పచ్చిమిర్చి, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కుక్కర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. తరువాత పుదీనా పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కూరగాయ ముక్కలు వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత బియ్యం వేసి వాటిలో ఉండే తేమ అంతా పోయే వరకు వేయించాలి. తరువాత నీళ్లు, కొబ్బరి పాలు, ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత కుక్కర్ మూత ఉంచి పెద్ద మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత దీనిని 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత మూత తీసి అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పుదీనా కొకోనట్ పులావ్ తయారవుతుంది. దీనిని రైతా, వెజ్, నాన్ వెజ్ కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి ఈ పులావ్ చక్కగా ఉంటుంది. వీకెండ్స్ లో ఈ విధంగా పుదీనాతో పులావ్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.