Brinjal Coconut Fry : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వంకాయలను మనం తరచూ ఆహారంగా భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వంకాయలతో ఎక్కువగా చేసే వంటకాల్లో వంకాయ ఫ్రై కూడా ఒకటి. వంకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ వంకాయ ఫ్రైలో కొబ్బరి వేసి దీనిని మనం మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి వేసి చేసే ఈ వంకాయ ఫ్రై తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. కొబ్బరి వేసి వంకాయ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ కొబ్బరి ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన వంకాయలు – పావు కిలో, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, పచ్చి కొబ్బరి ముక్కలు – 3 టేబుల్ స్పూన్స్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, నూనె – ఒక టేబుల్ స్పూన్.
వంకాయ కొబ్బరి ఫ్రై తయారీ విధానం..
ముందుగా జార్ లో కొబ్బరి ముక్కలు వేసి బరకగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, వంకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత వీటిపై మూతను ఉంచి చిన్న మంటపై వేయించాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా వేయించాలి. వంకాయ ముక్కలు వేగిన తరువాత పసుపు, కారం, ఉప్పు, మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ కొబ్బరి ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయలను తినని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు. వంకాయలతో మామూలుగా చేసే ఫ్రై కంటే ఈ విధంగా కొబ్బరి వేసి చేసే ఫ్రై మరింత రుచిగా ఉంటుంది.