Curd For Face : మనం ప్రతిరోజూ పెరుగును ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. పెరుగులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతగానో సహాయపడతాయి. అయితే పెరుగు కేవలం మన శరీర ఆరోగ్యాన్నే కాదు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. పెరుగును ఉపయోగించడం వల్ల ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం పొడిబారకుండా తాజాగా ఎల్లప్పుడూ నిగనిగలాడుతూ ఉంటుంది. అలాగే పెరుగును ఉపయోగించడం వల్ల దీనిలో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
పెరుగును ఉపయోగించడం వల్ల దెబ్బతిన్న చర్మ కణాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తెల్లగా మారుతుంది. అయితే ఈ పెరుగును ఎలా ఉపయోగించడం వల్ల మనం చక్కటి అందాన్ని సొంతం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ గోధుమపిండిని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చేత్తో కానీ, బ్రష్ తో కానీ ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్ పూర్తిగా ఆరే వరకు ముఖాన్ని కదిలించకుండా అలాగే ఉంచాలి.
ఈ ప్యాక్ పూర్తిగా ఆరిన తరువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ఎండ వల్ల ముఖంపై పేరుకుపోయిన ట్యాన్ తొలగిపోతుంది. చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి ముఖం అందంగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. ఈ చిట్కాను తరచూ వాడడం వల్ల మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.