Venna Undalu : బియ్యం పిండితో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసుకోదగిన తీపి వంటకాల్లో వెన్నుండలు కూడా ఒకటి. పాతకాలపు వంటకమైన ఈ వెన్నుండలు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వెన్నుండలను తయారు చేయడం కూడా చాలా తేలిక. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా గుల్లగుల్లగా ఉండే వెన్నుండలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెన్నుండల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, ఉప్పు – రెండు చిటికెలు, బటర్ – పావు కప్పు, పచ్చిపాలు – 3 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నీళ్లు – 3 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – ఒక టీ స్పూన్.
వెన్నుండల తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. తరువాత బియ్యాన్ని వడకట్టి వస్త్రంపై వేసి నీడలో తడి పోయే వరకు ఆరబెట్టాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని జల్లించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, బటర్ వేసి బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా పాలు పోస్తూ పిండిని నలుపుతూ బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని పగుళ్లు లేకుండా ఉండలుగా చుట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి మధ్యస్థంగా వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉండలను వేసి వేయించాలి. ఉండలు వేయగానే కలపకూడదు. వీటిని మధ్యస్థ మంటపై లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత కళాయిలో బెల్లం, నీళ్లు పోసి వేడి చేయాలి.బెల్లం కరిగి లేత ఉండ పాకం వచ్చే వరకు వేడి చేయాలి. ఇలా ఉండపాకం రాగానే యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న ఉండలను వేసి కలపాలి. ఉండలు పగిలి పోకుండా నెమ్మదిగా కలపాలి. ఉండలకు బెల్లం పట్టి అవి విడివిడిగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వెన్నుండలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. స్నాక్స్ గా కూడా వీటిని తినవచ్చు. వీటిని తినడం వల్ల రుచితో పాటు శరీరానికి కూడా మేలు కలుగుతుంది.