Sneezing : తుమ్ము అనేది మనకు సహజంగానే వచ్చే ఒక చర్య. మన ముక్కులో నుంచి దుమ్ము, ధూళి, కాలుష్య కారకాలు, పుప్పొడి రేణువులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు గాను తుమ్ము వస్తుంది. అలాగే జలుబు వంటివి వచ్చినప్పుడు కూడా విపరీతంగా తుమ్ములు వస్తుంటాయి. కొందరికి పడని ఆహారం తిన్నా.. గాలి పీల్చినా.. తుమ్ములు వస్తుంటాయి. కొందరికి చలి వాతావరణం పడదు. దీంతో తుమ్ములు వస్తాయి. అలాగే కొందరికి తినేటప్పుడు అనుకోకుండా తుమ్ములు వస్తుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కారణాలు ఏమున్నా తుమ్ము తుమ్మితే ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ తుమ్ము వచ్చినట్లే వచ్చి ఆగిపోతే చిరాకు పెడుతుంది.
తుమ్ములు వచ్చినట్టే వచ్చి ఆగిపోతుంటే అప్పుడు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. తుమ్ము తుమ్మకపోతే మనస్కరించదు. అలాంటి సమయాల్లో తప్పనిసరిగా తుమ్ము తుమ్మాలి. అయితే ఏం చేసినా తుమ్ము రావడం లేదు.. అనుకునే వారు కింద తెలిపిన కొన్ని చిట్కాలను పాటించవచ్చు. వీటిని తప్పనిసరి అయితేనే వాడాలి. దీంతో తుమ్ములు సరిగ్గా వస్తాయి. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
తుమ్ములు వచ్చినట్టే వచ్చి ఆగిపోతుంటే.. ముక్కులో ఉండే వెంట్రుకల్లో ఏదైనా ఒక వెంట్రుకను పట్టుకుని బయటకు లాగినట్లు చేయాలి. ఈ ప్రక్రియను సున్నితంగా చేయాలి. లేదంటే వెంట్రుక ఊడి అక్కడి నుంచి రక్తం రావచ్చు. అక్కడి ప్రదేశం సున్నితంగా ఉంటుంది. కనుక ఈ పనిని సున్నితంగా చేయాలి. ఇలా చేయడం వల్ల తుమ్ము వెంటనే వస్తుంది. దీంతో ఇబ్బంది పోతుంది. అలాగే ముక్కులో చిన్నపాటి ఈక లేదా కాటన్ బడ్‌ను పెట్టి సున్నితంగా తిప్పాలి. దీంతో కూడా తుమ్ము వెంటనే వస్తుంది. ఇక సూర్యుడు బాగా ఎండగా ఉన్నప్పుడు బయటకు వెళ్లి ముక్కు ఎండకు తగిలేలా నిలుచోవాలి. దీంతో ఆ వేడికి త్వరగా తుమ్ము వస్తుంది.
కొన్ని రకాల ఘాటైన వాసనలను పీల్చడం వల్ల కూడా తుమ్ము వస్తుంది. అయితే ఆ వాసనలు ఆరోగ్యానికి హాని కలిగించకుండా ఉండాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి. కొన్ని రకాల పువ్వులకు చెందిన వాసనలను పీలిస్తే త్వరగా తుమ్ములు వస్తాయి. అలాగే మెడికల్ షాపుల్లో లభించే ముక్కు స్ప్రేలను కూడా ప్రయత్నించవచ్చు. వీటితో కూడా తుమ్ములు వస్తాయి. అయితే ఎలాంటి చిట్కాను పాటించినా ఉపయోగం లేకపోతే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. లేదంటే సమస్య మరీ ఎక్కువయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించాల్సి ఉంటుంది.