Muskmelon Sharbath : వేసవికాలం రాగానే మనం చల్ల చల్లగా షర్బత్ లను తయారు చేసుకుని తాగుతూ ఉంటాం. షర్బత్ చాలా రుచిగా ఉంటుంది. ఎండ నుండి ఉపశమనాన్ని ఇవ్వడంలో ఇవి మనకు ఎంతో దోహదపడతాయి. మనం మన రుచికి తగినట్టు రకరకాల రుచుల్లో ఈ షర్బత్ లను తయారు చేసుకుని తాగుతూ ఉంటాం. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన షర్బత్ వెరైటీలలో మస్క్ మెలన్ షర్బత్ కూడా ఒకటి. ఈ షర్బత్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కర్బూజతో షర్బత్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మస్క్ మెలన్ షర్బత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కర్బూజ – 1 ( మధ్యస్థంగా ఉన్నది), నానబెట్టిన సగ్గు బియ్యం – అర కప్పు, పాలు – 2 కప్పులు, కస్టర్డ్ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్, మిల్క్ మెయిడ్ – పావు కప్పు, నానబెట్టిన సబ్జా గింజలు – 2 టేబుల్ స్పూన్స్.
మస్క్ మెలన్ షర్బత్ తయారీ విధానం..
ముందుగా మస్క్ మెలన్ ను గుజ్జును తీసి జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత సగ్గుబియ్యం వేసి మెత్తగా ఉడికించి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. పాలు మరిగిన తరువాత కస్టర్డ్ పౌడర్ ను నీటిలో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని పాలల్లో వేసి కలపాలి. పాలను ఒక పొంగు వచ్చే వరకు మరిగించిన తరువాత మిల్క్ మెయిడ్ వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న కర్బూజ వేసి కలపాలి. తరువాత దీనిని మధ్యస్థ మంటపై కలుపుతూ మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. కర్బూజ మిశ్రమం చల్లారిన తరువాత ఇందులో ఉడికించిన సగ్గుబియ్యం, నానబెట్టిన సబ్జా గింజలు వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మస్క్ మెలన్ షర్బత్ తయారవుతుంది. దీనిని చల్ల చల్లగా తాగితే మరింత రుచిగా ఉంటుంది. వేసవికాలంలో ఇలా కర్బూజతో షర్బత్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.