Dum Masala Aloo : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ధమ్ ఆలూ కర్రీ కూడా ఒకటి. మనకు ధాబాలలో ఎక్కువగా ఈ వంటకం లభిస్తుంది. ఈ దమ్ ఆలూ కర్రీని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, కమ్మగా, కలర్ ఫుల్ గా ఈ దమ్ ఆలూ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ధమ్ ఆలూ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బేబి పొటాటో – 300 గ్రా., నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – పావు టీస్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, టమాట ముక్కలు – ఒక కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 4, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 7, జీడిపప్పు – 10.
ధమ్ ఆలూ కర్రీ తయారీ విధానం..
ముందుగా జార్ లో పేస్ట్ కు కావల్సిన పదార్థాలన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసేసి వాటికి ఫోర్క్ తో అక్కడక్కడ గాట్లు పెట్టాలి. తరువాత ఈ బంగాళాదుంపలపై అర టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంపలు వేసి మధ్యస్థ మంటపై వేయించాలి. బంగాళాదుంపలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని కలుపుతూ నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.
దీనిని అర నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. గ్రేవి ఉడుకు పట్టగానే ముందుగా సిద్దం చేసుకున్న బంగాళాదుంపలను వేసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి 7 నుండి 8 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కొత్తిమీర, కసూరి మెంతి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ధమ్ ఆలూ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పులావ్, రోటి, బిర్యానీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా బేబి పొటాటోస్ తో ధమ్ ఆలూ కర్రీని తయారు చేసుకుని తినవచ్చు.