Chicken Chinese Rolls : చికెన్ తో కూరలే కాకుండా మనం వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో చికెన్ చైనీస్ రోల్స్ కూడా ఒకటి. చికెన్ తో చేసే ఈ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ చికెన్ చైనీస్ రోల్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ చైనీస్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బోన్ లెస్ చికెన్ – 200 గ్రా., క్యారెట్ తరుము – ఒక కప్పు, క్యాబేజ్ తురుము – ఒక కప్పు, చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు – ఒక కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు – 2, ఉప్పు -తగినంత, కారం -ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, సోయా సాస్ – ఒక టీ స్పూన్, వెనిగర్ – అర టీ స్పూన్, నెయ్యి – ఒక టీ స్పూన్, బ్రెడ్ క్రంబ్స్ – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, కోడిగుడ్లు – 2, తరిగిన స్ప్రింగ్ రోల్స్ – అర కప్పు.
చికెన్ చైనీస్ రోల్స్ తయారీ విధానం..
ముందుగా ఉడికించిన చికెన్ ను ముక్కలుగా చేసి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో క్యారెట్, క్యాప్సికం, క్యాబేజ్ తురుమును వేసుకోవాలి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ను కూడా వేసుకోవాలి. ఇందులోనే బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి. అలాగే కారం, ఉప్పు, జీలకర్ర పొడి, వెనిగర్, సోయా సాస్, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత నెయ్యి, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి కలపాలి. చికెన్ మిశ్రమం రోల్ లాగా చుట్టడానికి రాకపోతే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బ్రెండ్ క్రంబ్స్ వేసి కలపాలి. అలాగే బ్రెండ్స్ క్రంబ్స్ ను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. కోడిగుడ్లను కూడా గిన్నెలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా చికెన్ మిశ్రమాన్ని తీసుకుంటూ రోల్స్ లాగా చుట్టుకోవాలి. తరువాత వీటిని బ్రెండ్స్ క్రంబ్స్ తో కోటింగ్ చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ రోల్స్ ను కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ చైనీస్ రోల్స్ తయారవుతాయి. స్నాక్స్ గా తినడానికి ఈ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. చికెన్ తినని పిల్లలకు ఈ రోల్స్ ను ఇవ్వడం వల్ల సులభంగా చికెన్ ను తినేస్తారు. వీకెండ్స్ లో ఇలా చికెన్ తో రోల్స్ ను తయారు చేసుకుని తినవచ్చు.