Kurkure : మనకు షాపుల్లో లభించే వివిధ రకాల చిరుతిళ్లల్లో కుర్ కురేలు కూడా ఒకటి. కుర్ కురేలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు వివిధ రుచుల్లో ఇవి లభిస్తూ ఉంటాయి. మసాలా కుర్ కురేతో పాటు చటా పటా రుచుల్లో కూడా ఇవి లభిస్తూ ఉంటాయి. అయితే బయట లభించే కుర్ కురేలలో రంగుల్లో, ఫ్రిజర్వేటివ్స్ ను కలుపుతూ ఉంటారు. ఇవి ఏవి కలపకుండా ఈ కుర్ కురేలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రుచిగా, కరకరలాడుతూ ఉండే ఈ కుర్ కురేలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కుర్ కురే తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒక కప్పు, శనగపిండి – పావు కప్పు, గోధుమపిండి – 2 టేబుల్ స్పూన్స్, వంటసోడా – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – రెండు కప్పులు, బటర్ – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, కారం – అర టీ స్పూన్, గరం మసాలా -అర టీ స్పూన్, చాట్ మసాలా -అర టీ స్పూన్, చక్కెర పొడి – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కుర్ కురే తయారీ విధానం..
ముందుగా కళాయిలో గోధుమపిండి, శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, వంటసోడా వేసి తగినన్ని నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి. తరువాత ఈ కళాయిని స్టవ్ మీద ఉంచి చిన్న మంటపై కలుపుతూ ఉడికించాలి. దీనిని చపాతీ పిండి ముద్దలా అయ్య వరకు ఉడికించిన తరువాత బరట్ వేసి కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారనివ్వాలి. తరువాత దీనికి కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని రెండు చేతులతో కుర్ కురేలా వత్తుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కుర్ కురేలను వేసి కరకరలాడే వరకు వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కారం, చక్కెర పొడి, గరం మసాలా, చాట్ మసాలా కొద్దిగా ఉప్పు వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కుర్ కురేలు తయారవుతాయి. ఇవి కారం కారంగా తియ్య తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.