Potato Brinjal Curry : మనం వంటింట్లో ప్రతిరోజూ రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. కొన్ని కూరలు అన్నంలోకి బాగుంటే కొన్ని మాత్రం చపాతీ, రోటి వంటి వాటిలోకి బాగుంటాయి. అయితే కొన్ని కూరలు మాత్రం దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. అలాంటి రుచికరమైన కూరలల్లో బంగాళాదుంప వంకాయ కూర కూడా ఒకటి. ఈ కూరను దేనితోనైనా సైడ్ డిష్ గా తినవచ్చు. అలాగే దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే బంగాళాదుంప వంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంప వంకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన వంకాయలు – 4, తరిగిన బంగాళాదుంపలు – 3, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాటాలు – 2, లవంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర -అర టీ స్పూన్, మెంతులు – చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు – 10, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం -ఒకటిన్నర టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, గరం మసాలా -అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
![Potato Brinjal Curry : రైస్, చపాతీ, పులావ్ లాంటి వాటిలోకి రుచిగా కూర చేయాలంటే.. ఇలా చేయండి..! Potato Brinjal Curry recipe in telugu very tasty for rice and chapati](https://ayurvedam365-com.in9.cdn-alpha.com//opt/bitnami/wordpress/wp-content/uploads/2023/05/potato-brinjal-curry.jpg)
బంగాళాదుంప వంకాయ కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో ధనియాలు, లవంగాలు, చెక్క, జీలకర్ర, మెంతులు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే నూనెలో వంకాయ ముక్కలను కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి చిన్న మంటపై టమాట ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత పసుపు, కారం వేసి కలపాలి.
తరువాత వేయించిన బంగాళాదుంప ముక్కలు, వంకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బంగాళాదుంప వంకాయ కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పులావ్, రోటి ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.