Ragi Sunnundalu : సున్నండలు.. మినపప్పుతో చేసే ఈ తీపి వంటకం గురించి మనందరికి తెలిసిందే. సున్నండలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. సున్నండలను తినడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది. మినపప్పుతో పాటు రాగులను వేసి కూడా మనం సున్నండలను తయారు చేసుకోవచ్చు. రాగులను వేసి చేసే ఈ సున్నండలను తినడం వల్ల ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి సున్నండలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి సున్నండల తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగులు – 100 గ్రా., మినపప్పు – 200 గ్రా., యాలకులు – 4, బెల్లం – 200 గ్రా., కరిగించిన నెయ్యి – 200 గ్రా., వేయించిన జీడిపప్పు పలుకులు – కొద్దిగా.
రాగి సున్నండల తయారీ విధానం..
ముందుగా కళాయిలో రాగులను తీసుకుని చిన్న మంటపై దోరగా వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని అదే కళాయిలో మినపప్పు కూడా వేసి వేయించాలి. మినపప్పును కూడా కలుపుతూ దోరగా వేయించిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తరువాత రాగులను అలాగే బియ్యాన్ని ఒక జార్ లోకి తీసుకుని పొడిగా అయ్యే వరకు మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో బెల్లాన్ని కూడా వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు రాగి పిండి, బెల్లం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత జీడిపప్పు పలుకులు, నెయ్యి వేసి కలపాలి. అంతా కలిసేలా కలిపిన తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని సున్నండలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి సున్నండలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. రోజుకు ఒక సున్నండను పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.