Osmania Biscuits : ఉస్మానియా బిస్కెట్లు.. ఇవి తెలియని వారు వీటిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఉస్మానియా బిస్కెట్లు గుల్ల గుల్లగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని టీ తో కలిపి తింటూ ఉంటారు. ఉస్మానియా బిస్కెట్లు లేని టీ దుకాణాలు, కేఫ్ లు ఉండవనే చెప్పవచ్చు. మనకు ఈ బిస్కెట్లు మార్కెట్ లో విరివిరిగా లభిస్తూ ఉంటాయి. బయట కొనుగోలు చేసే అవసరం లేకుండా ఇంట్లోనే మనం ఈ బిస్కెట్లను తయారు చేసుకోవచ్చు. ఉస్మానియా బిస్కెట్లను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉస్మానియా బిస్కెట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
బటర్ – అర కప్పు, పంచదార పొడి – అర కప్పు, వెనీలా ఎసెన్స్ – 1/8 టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, మైదాపిండి – ఒక కప్పు, బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూన్.
ఉస్మానియా బిస్కెట్ల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బటర్ ను తీసుకోవాలి. బటర్ గది ఉష్ణోగ్రత వద్ద ఉండేలా చూసుకోవాలి. తరువాత ఇందులో పంచదార పొడి వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత వెనీలా ఎసెన్స్, ఉప్పు వేసి కలపాలి. తరువాత మైదాపిండి. బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. ఇప్పుడు దీనిని ముద్దలాగా చేసుకోవాలి. అవసరమైతే తప్ప నీటిని కానీ, పాలను కానీ పోయకూడదు. బటర్ తోనే పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలి. ఒక్కో భాగాన్ని తీసుకుంటూ నూనె రాసిన ప్లేట్ లేదా చపాతీ పీట మీద వేసి అంగుళం మందంతో చపాతీ కర్రతో వత్తుకోవాలి. తరువాత బాటిల్ క్యాప్ ను తీసుకుని గుండ్రంగా బిస్కెట్ల ఆకారంలో కట్ చేసుకోవాలి. ఈ బిస్కెట్లను నెయ్యి రాసిన ప్లేట్ మీద వేసుకోవాలి.
బిస్కెట్ల మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి. తరువాత ఈ బిస్కెట్లపై బ్రష్ తో పాలను తీసుకుంటూ కోట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత ఇందులో బిస్కెట్ల ప్లేట్ ను ఉంచి మూత పెట్టి చిన్న మంటపై 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న తరువాత బిస్కెట్లను బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత వీటిని డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉస్మానియా బిస్కెట్లు తయారవుతాయి. వీటిని సాయంత్రం సమయాల్లో టీ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లో అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.