Oats Vegetable Idli : మనం అల్పాహారంగా తీసుకునే పదార్థాల్లో ఇడ్లీలు కూడా ఒకటి. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఇడ్లీలను మనం మరింత రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా తయారు చేసుకోవచ్చు. ఓట్స్ మరియు వెజిటేబుల్స్ వేసి చేసే ఈ ఇడ్లీలు కూడా చాలా రుచిగా, మెత్తగా ఉంటాయి. అలాగే ఈ ఇడ్లీలను మనం ఇన్ స్టాంట్ గా అరగంటలోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – ఒక కప్పు, బొంబాయి రవ్వ – అర కప్పు, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన చ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, పెరుగు – అర కప్పు, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన క్యాప్సికం -2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – తగినన్ని, రెబ్ చిల్లీ ప్లేక్స్ – అర టీ స్పూన్,వంటసోడా – ఒక టీ స్పూన్.
ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఓట్స్ ను వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తరువాత అదే కళాయిలో రవ్వ వేసి దోరగా వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వేయించిన ఓట్స్ ను జార్ లోకి తీసుకుని బరకగా మిక్సీ పట్టుకున దీనిని కూడా గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు, వంటసోడా తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి పావు గంట పాటు రవ్వను నానబెట్టాలి. ఇప్పుడు వంటసోడా వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. తరువాత ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి వేడి చేయాలి.
తరువాత ఇడ్లీ ప్లేట్ లలో పిండిని వేసుకుని కుక్కర్ లో ఉంచాలి. వీటిపై మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీలను బయటకు తీసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ వెజిటెబుల్ ఇడ్లీలు తయారవుతాయి. వీటిని చట్నీ, సాంబార్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. తరచూ చేసే ఇడ్లీలతో పాటు ఇలా వెజిటేబుల్ ఇడ్లీలను చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.