Kidney Beans : కిడ్నీ బీన్స్.. వీటినే రాజ్మా అని కూడా పిలుస్తారు. ఇవి చిక్కుడు జాతికి చెందిన మొక్కల నుండి సేకరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వీటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మన దేశంలో నార్త్ ఇండియా వారు వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. రాజ్మాతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువగా చపాతీ, రోటీ వంటి వాటిలోకి వీటిని కూరగా వండుకుని తింటూ ఉంటారు. అయితే రుచితో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. మాంసాహారం తీసుకోని వారు ఈ రాజ్మాను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినన్ని పోషకాలు అందుతాయి. ప్రోటీన్స్ తో పాటు వీటిలో ఐరన్, కాపర్, మాంగనీస్, విటమిన్ బి1, ఫోలేట్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే వీటిలో ఐసోప్లేవోన్, ప్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
రాజ్మాను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాకుండా రాజ్మా యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక వీటిని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రాజ్మాను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను నిర్మూలించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో కూడా ఇవి దోహదపడతాయి. వీటిలో ఉండే పొటాషియం రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో దోహదపడుతుంది. అంతేకాకుండా రాజ్మాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో నిర్మూలించడంలో సహాయపడతాయి. దీంతో మనం క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. రాజ్మాలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.
జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, మలబద్దకాన్ని తగ్గించడంలో ఇవి చక్కగా పని చేస్తాయి. రాజ్మాను తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా, బలంగా తయారవుతాయి. శరీరం పుష్టిగా, బలంగా తయారవుతుంది. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈవిధంగా రాజ్మా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాజ్మాను కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.