Palagunda : పాల గుండలు.. వీటినే పాల పలుకుల అని కూడా అంటారు. వీటి గురించి మనలో చాలా మందికి తెలిసి ఉండదు. కానీ పాలగుండలను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే వీటితో పాల ముంజలు అనే తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. పాల గుండలు తెల్లగా పలుకుల రూపంలో లభిస్తూ ఉంటాయి. పాల గుండలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో ఫైబర్, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. పాల గుండలను తీసుకోవడం వల్ల మనం చక్కగి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పాలగుండలు మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణశక్తిని మెరుగుపరచడంలో పాల గుండలు మనకు ఎంతో సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్లమనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అందులో ఉండే పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో కూడా పాలగుండలు మనకు దోహదపడతాయి. అలాగే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీర బరువు తగ్గేలా చేయడంలో కూడా ఇవి మనకు దోహదపడతాయి. అంతేకాకుండా పాల గుండల్లో అధికంగా ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో దోహదపడుతుంది. అంతేకాకుండా పాలగుండల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. మనం తీసుకునే ఆహారం, నీరు ద్వారా వ్యాపించే సాల్మోనెల్లా వైరస్ ను నివారించడంలో ఈ పాలగుండలు సమర్థవంతంగా పని చేస్తాయి.
అదే విధంగా గర్భవతులకు ఎంతో అవసరమైన ఫోలెట్ ఈ పాలగుండల్లో ఎక్కువగా ఉంటుంది. కనుక గర్భవతులు వీటిని తీసుకోవడం వల్ల పుట్టే పిల్లల్లో జన్యుపరమైన లోపాలు రాకుండా ఉంటాయి. అలాగే దంతాల నొప్పులు, చిగుళ్ల నొప్పులతో బాధపడే వారు కూడా పాలగుండలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అదే విధంగా వేసవి కాలంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఈ విధంగా పాలగుండలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వీటిని తీపి పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే ఈ పాలగుండలను నీటిలో వేసి కరిగించి తాగుతూ ఉంటారు. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా వీటిని తీసుకోవచ్చు. పాలగుండలను తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా కలగవు.