Raw Coconut Laddu : పచ్చి కొబ్బరిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మెదడు చక్కగా పని చేసేలా చేయడంలో, రక్తహీనతను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా పచ్చి కొబ్బరి మనకు సహాయపడుతుంది. ఈ పచ్చి కొబ్బరితో ఎక్కువగా చట్నీలను తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ పచ్చికొబ్బరితో మనం రుచికరమైన లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి, బెల్లం కలిపి చేసే ఈ లడ్డూలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా తేలిక. అలాగే వీటిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ కొబ్బరి లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి కొబ్బరి లడ్డూలు తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి ముక్కలు – అర చిప్ప, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు – 3 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – ఒక టేబుల స్పూన్.
పచ్చి కొబ్బరి లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో కొబ్బరి ముక్కలను తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో బెల్లాన్ని తీసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం నీటిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. దీనిని కొద్దిగా రంగు మారే వరకు వేయించిన తరువాత కరిగించిన బెల్లం నీటిని పోసి కలపాలి. దీనిని దగ్గర పడే ఇలా కలుపుతూ వేయించాలి. పచ్చి కొబ్బరి మిశ్రమం పూర్తిగా దగ్గర పడిన తరువాత కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని ఉండలా చుట్టి చూడాలి. కొబ్బరి మిశ్రమం ఉండలా చుట్టడానికి రాగానే యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత చేత్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చి కొబ్బరి లడ్డూలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు లేదా కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు రుచికరమైన లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ లడ్డూలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.