Hyderabadi Dum Ka Mutton : మనకు రెస్టారెంట్ లలో లభించే మటన్ వెరైటీలలో ధమ్ కా మటన్ కూడా ఒకటి. ఈ మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తటి మటన్ ముక్కలతో తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఈ దమ్ కా మటన్ ను మనం అదే రుచితో ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మటన్ కర్రీని తయారు చేయడం చాలా సులభం. వీకెండ్స్, స్పెషల్ డేస్ లో ఈ మటన్ తో ఈ కర్రీని వండుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ హైదరాబాదీ ధమ్ కా మటన్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాదీ ధమ్ కా మటన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ – అరకిలో, ఉప్పు – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నీళ్లు – అర గ్లాస్, బాదంపప్పు – 10, జీడిపప్పు – 10, ఎండు కొబ్బరి – రెండు ఇంచుల ముక్క, తర్బూజ గింజలు – ఒక టీ స్పూన్, గసగసాలు -ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 3, లవంగాలు – 4, ఫ్రైడ్ ఆనియన్స్ – ఒక కప్పు, పెరుగు – 200 గ్రా., ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన కొత్తిమీర -కొద్దిగా, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, నిమ్మరసం – అర చెక్క.
హైదరాబాదీ ధమ్ కా మటన్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో మటన్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, నీళ్లు పోసి మూత పెట్టాలి. ఈ మటన్ ను 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో బాదంపప్పు, జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి ముక్కలు, తర్బూజ గింజలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలో ఉడికించిన మటన్ ను నీటితో సహా తీసుకోవాలి. తరువాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ ను నలిపి వేసుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ను వేసుకోవాలి. తరువాత మరో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకటిన్నర టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు మిగిలిన పదార్థాలను కూడా ఒక్కొక్కటిగా వేసి కలపాలి. ఇప్పుడు ఈ గిన్నెను సిల్వర్ ఫాయిల్ తో మూసి వేయాలి.
ఇది అందుబాటులో లేని వారు గిన్నె అంచుల చుట్టు గోధుమపిండి ముద్దను ఉంచి మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా చేసుకోవాలి. తరువాత ఈ మటన్ ను ఇలాగే ఉంచి రెండు గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక మంటను చిన్నగా చేసి దానిపై మటన్ ను గిన్నెను ఉంచి వేడి చేయాలి. దీనిని ఇలాగే చిన్న మంటపై 20 నుండి 25 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మూత తీసి అంతా కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. దీనిని రోటీ, చపాతీ, పుల్కా, నాన్, జీరా రైస్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.