Beans Curry : బీన్స్.. మనం ఆహారంగా తీసుకోదగిన కూరగాయల్లో ఇవి కూడా ఒకటి. ఇతర కూరగాయల వలె బీన్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఎక్కువగా ఫ్రైడ్ రైస్, వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ వంటి వాటి తయారీలో ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే ఈ బీన్స్ తో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. బీన్స్ తో చేసే ఈ కూర చాలా రుచిగా, గ్రేవీతో ఉండడంతో పాటు దీనిని చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ బీన్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీన్స్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బీన్స్ – పావు కిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర లేదా రెండు టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, శనగపిండి – 2 టీ స్పూన్స్, కొబ్బరి పొడి – 2 టీ స్పూన్స్, చిన్నగా తరిగిన టమాట – 1, నీళ్లు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బీన్స్ కర్రీ తయారీ విధానం..
ముందుగా బీన్స్ ను తరిగి శుభ్రంగా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత బీన్స్ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు మంటను పెద్దగాచేసి బీన్స్ ముక్కలను 3 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తరువాత మంటను మధ్యస్థంగా చేసుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, శనగపిండి, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి.
దీనిపై వేరే మూతను ఉంచి టమాట ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత నీళ్లు, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత కుక్కర్ పై మూతను ఉంచి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి పోయిన తరువాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీన్స్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బీన్స్ ను ఇష్టపడని వారు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారు.