Egg Roast : ఎగ్ రోస్ట్.. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఎగ్ రోస్ట్ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్లు ఉంటే చాలు ఈ కూరను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కోడిగుడ్లతో ఎగ్ రోస్ట్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ రోస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 4, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, నూనె – పావు కప్పు, సోంపు గింజలు -అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన టమాట ముక్కలు – ఒక కప్పు, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతులు – పావు టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, ధనియాలు -ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 2, లవంగాలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ.
ఎగ్ రోస్ట్ తయారీ విధానం..
ముందుగా కోడిగుడ్లను మధ్యలోకి కట్ చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సోంపు గింజలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలిపి మూతయ పెట్టాలి. వీటిని మెత్తబడే వరకు వేయించిన తరువాత ఉప్పు, కారం, పసుపు, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి.
తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత కట్ చేసుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. ఇప్పుడుమరలా మూతను ఉంచి 2 నిమిషాల పాటు వేయించిన తరువాత కోడిగుడ్లను మరో వైపుకు తిప్పుకోవాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించుకుని కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ రోస్ట్ తయారవుతుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు కోడిగుడ్డు వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ ఎగ్ రోస్ట్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.