Garlic Chicken Curry : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలలో గార్లిక్ చికెన్ మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే చికెన్ కర్రీల కంటే ఈ కర్రీ మరింత రుచిగా ఉంటుంది. నాన్, రోటీ, వంటి వాటితో తినడానికి ఈ చికెన్ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. మనలో చాలా మంది ఈ కర్రీని ఇప్పటికే రుచి చూసి ఉంటారు. ఈ గార్లిక్ చికెన్ మసాలా కర్రీని మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. బ్యాచిలర్స్, మొదటిసారి చేసే వారు ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ గార్లిక్ చికెన్ మసాలా కర్రీని రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గార్లిక్ చికెన్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 10, కారం -ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, టమాట కిచప్ – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, గరం మసాలా – ఒకటిన్నర టీ స్పూన్, కసూరి మెంతి -ఒక టీ స్పూన్, నీళ్లు – అర గ్లాస్.

మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, ఉప్పు – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, జీలకర్రపొడి – అర టీ స్పూన్, నిమ్మరసం- అర చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్, మెత్తగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 8, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తియ్యటి పెరుగు – 100 గ్రా..
గార్లిక్ చికెన్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి అర గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత వెల్లుల్లి పేస్ట్ వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే కారం, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత టమాట కిచప్ వేసి కలపాలి. తరువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి కలపాలి. తరువాత ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి.
తరువాత దీనిపై మూత పెట్టి చిన్న మంటపై మధ్య మధ్యలో కలుపుతూ 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కసూరి మెంతి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. దీనిని చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించిస్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గార్లిక్ చికెన్ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని రోటి, పుల్కా, నాన్, పూరీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఎంతో రుచిగా ఉండే ఈ గార్లిక్ చికెన్ మసాలా కర్రీని మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.