Paneer Shahi Biryani : పనీర్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పనీర్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పనీర్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పనీర్ షాహీ బిర్యానీ కూడా ఒకటి. మనకు రెస్టారెంట్ లలో ఇది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ బిర్యానీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తరచూ తినే వంటకాలు బోర్ కొట్టినప్పుడు ఇలా అప్పటికిప్పుడు రుచిగా పనీర్ తో బిర్యానీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ పనీర్ షాహీ బిర్యానీని సులభంగా ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ షాహీ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఫ్రైడ్ ఆనియన్స్ – పావు కప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, టమాటాలు – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, షాహీ బిర్యానీ మసాలా – ఒకటిన్నర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, కుంకుమ పువ్వు నానబెట్టిన నీళ్లు – కొద్దిగా.
మ్యారినేట్ చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు..
పనీర్ – 200 గ్రా., పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – రెండున్నర టీ స్పూన్స్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు, నూనె – అర టేబుల్ స్పూన్.
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒకటిన్నర గ్లాస్,నూనె -ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, బిర్యానీ ఆకు – 2, అనాస పువ్వు – 1, మరాఠి మొగ్గ -1,సాజీరా – అర టీ స్పూన్, జాపత్రి – కొద్దిగా, ఉప్పు – ఒక టేబుల్ స్పూన్.
పనీర్ షాహీ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా పనీర్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత వీటిపై మూత పెట్టి అర గంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత అన్నం తయారీకి గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి, మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి కలపాలి. ఈ బియ్యాన్ని 90 శాతం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని వడకట్టి పక్కకు ఉంచాలి.
ఇప్పుడు అడుగ మందంగా ఉండే గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. తరువాత టమాటాలను ఫ్యూరీలాగా చేసుకుని వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి కలపాలి. తరువాత పనీర్ ముక్కలు వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసి కలపాలి. తరువాత ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి. దీనిని సమానంగా చేసిన తరువాత ఫ్రైడ్ ఆనియన్స్ ను, కొత్తిమీరను చల్లుకోవాలి.
తరువాత రెండు టీ స్పూన్ల నెయ్యి, కుంకుమ పువ్వు నీళ్లు, కొద్దిగా బిర్యానీ మసాలా చల్లుకుని ఆవిరి పోకుండా మూత పెట్టాలి. దీనిని 5 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై 10 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మరో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత మూత తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనీర్ షాహీ బిర్యానీ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన బిర్యానీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.