Aloo Fried Rice : మనం వంటింట్లో రకరకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రైస్ వెరైటీలలో ఆలూ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. బంగాళాదుంపలతో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మిగిలిన అన్నంతో కూడా ఈ రైస్ ను తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా రైస్ ను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – ఒక కప్పు బియ్యంతో ఉడికించినంత, తరిగిన టమాట – 1, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర -కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్న ముక్కలుగా తరిగిన బంగాళాదుంప – పెద్దది ఒకటి, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు -అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్ లేదా తగినంత, చాట్ మసాలా – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్.
ఆలూ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా అన్నాన్ని పొడి పొడిగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించిన తరువాత టమాట ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మరో 4 నిమిషాల పాటు వేయించాలి.
బంగాళాదుంప ముక్కలు మెత్తగా అయిన తరువాత కారం, గరం మసాలా, చాట్ మసాలా, పసుపు వేసి కలపాలి. వీటిని నిమిషం పాటు వేయించిన తరువాత అన్నం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న మరో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ రైస్ చాలా చక్కగా ఉంటుంది.