Dum Ka Seviyan : మనం సేమియాతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో ధమ్ కా సేవియాన్ కూడా ఒకటి. సన్నటి సేమ్యాతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఈ వంటకాన్ని ఎంత తిన్నా తనివి తీరదనే చెప్పవచ్చు. దీనిని ఎక్కువగా ముస్లింలు రంజాన్ మాసంలో తయారు చేస్తూ ఉంటారు. ఈ ధమ్ కా సేవియాను తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. కమ్మటి రుచితో నోట్లో వేసుకుంటూ కరిగపోయేంత మృదువుగా ఉండే ఈ ధమ్ కా సేవియాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ధమ్ కా సేవియాన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నటి సేమ్యా – అరకిలో, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, డ్రై ప్రూట్స్ – తగినన్ని, నీళ్లు – 3 గ్లాసులు, పంచదార – కిలో, ఫుడ్ కలర్ – కొద్దిగా, పచ్చి కోవా – పావుకిలో, యాలకుల పొడి – అర టీ స్పూన్.
దమ్ కా సేవియాన్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచాలి. తరువాత అదే కళాయిలో సేమ్యా వేసి వేయించాలి. దీనిని ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత వేయించిన సేమ్యా వేసి కలపాలి. సేమ్యా మెత్తగా ఉడికిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉడికించాలి.
తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. ఈ సేమ్యాను కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత కోవా వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తరువాత మరో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ధమ్ కా సేవియాన్ తయారవుతుంది. దీనిని చక్కగా నిల్వ చేసుకోవడం వల్ల 10 రోజుల పాటు తాజాగా ఉంటుంది. సేమ్యాతో ఈ విధంగా తయారు చేసిన ఈ తీపి వంటకాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.