Ponnaganti Pesarapappu Kura : మనం ఆహారంగా తీసుకోదగిన ఆకుకూరలల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. ఇది ఎక్కువగా మనకు వర్షాకాలంలో లభిస్తూ ఉంటుంది. ఇతర ఆకుకూరల కంటే పొన్నగంటి కూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ ఆకుకూరను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ సాఫీగా సాగుతుంది. రక్తప్రసరణ వేగవంతం అవుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఈ విధంగా పొన్నగంటి కూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇతర ఆకుకరల వలె దీనితో కూడా రకరకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా పొన్నగంటి ఆకుకూరను పెసరపప్పుతో కలిపి ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పొన్నగంటి పెసరపప్పు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పొనగంటి కూర – 3 కట్టలు, అరగంట పాటు నానబెట్టిన పెసరపప్పు- ఒక కప్పు, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, తరిగిన ఉల్లిపాయ -1, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన టమాట – 1, కరివేపాకు -ఒక రెమ్మ, ఎండుమిర్చి – 3, వెల్లుల్లి రెబ్బలు – 8, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
పొన్నగంటి పెసరపప్పు కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత శుభ్రం చేసిన పొన్నగంటి ఆకును వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత పెసరపప్పు వేసి కలపాలి. తరువాత చింతపండు రసం, ఒక కప్పు నీళ్లు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు ఉడికించాలి. పెసరపప్పు మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొన్నగంటి పెసరపప్పు కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పొన్నగంటి కూరతో కూరను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.