Chilli Idli : మనం అల్పాహారంగా తీసుకునే ఆహార పదార్థాల్లో ఇడ్లీ కూడా ఒకటి. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం చాలా సులభం. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే తరచూ ఇడ్లీ, చట్నీ, సాంబార్ తిని తిని బోర్ కొట్టిన వారు ఈ ఇడ్లీలతో ఎంతో రుచిగా ఉండే చిల్లీ ఇడ్లీలను కూడా తయారు చేసుకోవచ్చు. మిగిలిన ఇడ్లీలతో కూడా ఈ చిల్లీ ఇడ్లీని తయారు చేసుకోవచ్చు. ఇడ్లీలను తినని వారు కూడా ఈ చిల్లీ ఇడ్లీలను ఇష్టంగా తింటారు. అందరికి నచ్చేలా మరింత రుచిగా ఈ చిల్లీ ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చిల్లీ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇడ్లీలు – 6, టమాట సాస్ -ఒక టీ స్పూన్, సోయా సాస్- ఒక టీ స్పూన్, వెనిగర్ -ఒక టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ -ఒక టీ స్పూన్, పెద్ద ముక్కలుగా తరిగిన క్యాప్సికం – 1, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ, వెల్లుల్లి తరుగు -ఒక టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్.
చిల్లీ ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఇడ్లీలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత క్యాప్సికం ముక్కలు వేసి కలపాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించిన తరువాత వెనిగర్, చిల్లీ సాస్, సోయా సాస్, టమాట సాస్ వేసి కలపాలి.
దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. దీనిని నిమిషం పాటు వేయించిన తరువాత ఇడ్లీ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు మంటను చిన్నగా చేసి దీనిని 5 నిమిషాల పాటు ఇలాగే ఉంచాలి. తరువాత కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిల్లీ ఇడ్లీ తయారవుతుంది. చట్నీ, సాంబార్ లేకుండా ఈ ఇడ్లీలను నేరుగా ఇలాగే తినవచ్చు. ఈ విధంగా చేసిన చిల్లీ ఇడ్లీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.