Sweet Shop Style Ariselu : మనం పండుగలకు చేసే పిండి వంటల్లో అరిసెలు కూడా ఒకటి. అరిసెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చాలా మంది అరిసెలను, నెయ్యితో పప్పుతో ఇష్టంగా తింటూ ఉంటారు. అరిసెలు రుచిగా ఉన్నప్పటికి వీటిని తయారు చేయడం కష్టంతో కూడుకున్న పని అందరూ భావిస్తారు. కానీ అందరికి ఎంతో ఇష్టమైన ఈ అరిసెలను తయారు చేయడం చాలా సులభం. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు కూడా ఈ అరిసెలను సులభంగా తయారు చేసుకోవచ్చు. పక్కా కొలతలతో అరిసెలను రుచిగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరిసెల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – కిలో, బెల్లం తురుము – 700 గ్రా., నీళ్లు – 20 ఎమ్ ఎల్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా,యాలకుల పొడి -అర టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్.
అరిసెల తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 12 గంటల పాటు నానబెట్టాలి. తరువాత బియ్యాన్ని జల్లిగిన్నెలో వేసి నీరంతా పోయే వరకు 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ బియ్యాన్ని గిర్నిలో వేసిపిండిలా చేసుకోవచ్చు లేదా జార్ లో వేసి పిండిలా చేసుకోవచ్చు. తరువాత ఈ పిండిని జల్లించి మెత్తటి పిండిని గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత మరో గిన్నెలో బెల్లం తురుము,నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దీనిని చిన్న మంటపై మరో 4 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత బెల్లం మిశ్రమాన్ని నీటిలో వేసి పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. బెల్లం మిశ్రమం ఉండలా కట్టడానికి రాగానే ముందుగా సిద్దం చేసుకున్న బియ్యం పిండిని వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్న తరువాత యాలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. దీనిని కొద్దిగా దగ్గర పడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని గట్టి పడే వరకు అలాగే ఉంచాలి. బియ్యం పిండి మిశ్రమం గట్టిపడిన తరువాత నిమ్మకాయంత ఉండలుగా చేసుకోవాలి.
తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని కవర్ మీద వేసి నూనె రాసుకుంటూ చేత్తో అరిసెలా వత్తుకోవాలి. నూనె వేడయ్యాక అరిసెను వేసి కాల్చుకోవాలి. ఈ అరిసెలను మధ్యస్థ మంటపై రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత ఈ అరిసెను రెండు గంటెలతో లేదా అరిసెల ప్రెస్ తో ఎక్కువగా ఉండే నూనె అంతా పోయేలా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అరిసెలు తయారవుతాయి. ఈ అరిసెలను వత్తుకునేటప్పుడు వాటిపై నువ్వులను వేసి వత్తుకుని నువ్వుల అరిసెలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన అరిసెలు నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి. కేవలం పండుగలకే కాకుండా తీపి తినాలనిపించినప్పుడు ఈ విధంగా సులభంగా అరిసెలను తయారు చేసుకుని తినవచ్చు.