Karivepaku Kobbari Pachadi : మనం చేసే ప్రతి వంటలోనూ కరివేపాకును విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. వంటల్లో వేయడంతో పాటు కరివేపాకుతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ కరివేపాకు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు కొబ్బరి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి – 3, ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పు, కరివేపాకు – ఒక కట్ట, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4.
కరివేపాకు కొబ్బరి పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో కందిపప్పు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఎండుకొబ్బరి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. కరివేపాకును కరకరలాడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఆమ్ చూర్ పొడి వేసి కలపాలి. ఇప్పుడు వీటన్నింటిని జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత పచ్చడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కొబ్బరి పచ్చడి తయారవుతుంది. దీనిని నెయ్యి, వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా కరివేపాకుతో పచ్చడిని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.