Mutton Keema Fry : నాన్ వెజ్ ప్రియులకు మటన్ కీమా రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మటన్ కీమాతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా త్వరగా ఉడుకుతాయి. మటన్ కీమాతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మటన్ కీమా ఫ్రై కూడా ఒకటి. దేనితో తినడానికైనా ఈ కీమా ఫ్రై చాలా చక్కగా ఉంటుంది. కీమా ఫ్రైను తయారు చేయడం చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ మటన్ కీమా ఫ్రైను రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ కీమా ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, ఉప్పు -తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, మటన్ కీమా – పావుకిలో, నీళ్లు – ఒక గ్లాస్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మటన్ కీమా ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత కీమా వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 20 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి కీమా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. కీమా మెత్తగా ఉడికి నీరంతా పోయి దగ్గర పడిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ కీమా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మటన్ కీమాను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.