Mustard : మన వంట గదిలో తాళింపు డబ్బాలో ఉండే దినుసుల్లో ఆవాలు కూడా ఒకటి. దాదాపు మనం చేసే ప్రతి వంటలోనూ ఆవాలను వాడుతూ ఉంటాము. ఆవాలు కూరలకు చక్కటి వాసనను తీసుకురావడంలో సహాయపడతాయి. అయితే చాలా మంది కూరల్లో ఉండే ఆవాలను తీసి పడేస్తూ ఉంటారు. కానీ ఆవాలలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ వంటల్లో వాడడమే తప్ప చాలా మందికి వీటిని వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం తెలియవు. చూడడానికి చిన్నగా ఉన్నప్పటికి వీటి వల్ల మనం ఎన్నో లాభాలను పొందవచ్చు.
గాయాలు తగిలినప్పుడు వాటిపై ఆవపొడిని చల్లుకోవాలి. ఇలా చల్లడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. అలాగే నీటిలో ఆవాలను వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల దంతాల నొప్పులు తగ్గుతాయి. శ్వాసకోశ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక టీ స్పూన్ ఆవాల పొడిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు త్వరగా తగ్గు ముఖం పడతాయి. అలాగే కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఆవాలు మనకు దోహదపడతాయి. ఆవాలు, కర్పూరం కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని కీళ్ల నొప్పులు ఉన్న చోట రాయాలి.
ఇలా చేయడం వల్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా ఆవాలను పేస్ట్ గా చేసి పులిపిర్లపై రాయాలి. ఇలా తరచూ రాయడం వల్ల పులిపిర్లు రాలిపోతాయి. అలాగే వంటల్లో ఆవాలను వాడడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆకలి పెరుగుతుంది. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. అదే విధంగా కొబ్బరి నూనెలో ఆవపొడిని కలిపి జుట్టు రాసుకుని ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే చుండ్రు సమస్యతో బాధపడే వారు ఆవ నూనెను తలకు పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఆవాలు మనకు ఎంతో మేలు చేస్తాయని ఇకనైనా ఆవాలను ఏరిపారేయకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.