Minapa Chakralu : జంతికలు..మనం తయారు చేసుకునే పిండి వంటకాల్లో ఇవి కూడా ఒకటి. జంతికలు చాలా రుచిగా ఉంటాయి. క్రిస్పీగా ఉండే ఈ జంతికలను చాలా మంది ఇష్టంగా తింటారు. మనం ఎక్కువగా శనగపప్పుతో జంతికలను తయారు చేస్తూ ఉంటాము. శనగపప్పుతో పాటు మినపప్పుతో కూడా మనం జంతికలను తయారు చేసుకోవచ్చు.మినపప్పుతో చేసే ఈ జంతికలు కూడా చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మినప జంతికలను చేసుకోవడానికి మినపప్పును, బియ్యాన్ని ఏ కొలతలతో తీసుకోవాలి..ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మినప జంతికల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపగుళ్లు – 2 గ్లాసులు, బియ్యం – 6 గ్లాసులు, బటర్ – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, వాము – అర టీ స్పూన్, నువ్వులు -ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మినప జంతికల తయారీ విధానం..
ముందుగా 2 గ్లాసుల మినపగుళ్లకు ఆరు గ్లాసుల బియ్యాన్ని కలిపి మర ఆడించి పిండిలా చేసుకోవాలి. తరువాత ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలు వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత జంతికల గొట్టాన్ని తీసుకుని దానికి నూనె రాయాలి. తరువాత తగినంత పిండిని ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జంతికలను వత్తుకుని కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ కాల్చుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మినప జంతికలు తయారవుతాయి. ఇంట్లో అందరూ వీటిని ఇష్టంగా తింటారు. బయట లభించే చిరుతిళ్లను తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే రుచిగా జంతికలను తయారు చేసుకుని స్నాక్స్ గా తినవచ్చు.