Soup : వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు లేదా వేడి వేడిగా ఏదైనా తాగాలనిపించినప్పుడు మనం ఎక్కువగా సూప్ లను తాగుతూ ఉంటాము. మనం మన అభిరుచికి తగినట్టు వివిధ రుచుల్లో సూప్ ను తయారు చేసుకుని తాగుతూ ఉంటాము. అయితే ఈ సూప్ లను భోజనం చేయడానికి అరగంట ముందు తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భోజనానికి ముందుగా సూప్ ను తాగడం వల్ల ఆకలి ఎక్కువగా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. భోజనానికి ముందు సూప్ ను తాగడం వల్ల ఎంజైమ్ లు, డైజెస్టివ్ జ్యూసెస్ లు, గ్యాస్టిక్ర్ సిక్రేషన్ కు సంబంధించినవన్నీ కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో ఆకలి పెరుగుతుంది.
సూప్ మన పొట్టను, జీర్ణాశయాన్ని ముందుగానే సిద్దం చేస్తుంది. దీంతో మనం ఎక్కువ ఆహారాన్ని తీసుకోగలుగుతాము. అలాగే భోజనానికి ముందు సూప్ ను తాగడం వల్ల తిన్న ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది. అలాగే సూప్ ల తయారీలో వాడే మిరియాల పొడి, జీలకర్ర పొడి వంటివి మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అయితే సూప్ లను వీలైనంత వరకు ఇంట్లోనే తయారు చేసి తీసుకోవడం మంచిది. బయట లభించే ఇన్ స్టాంట్ సూప్ లను వాడకపోవడమే మంచిది. బయట లభించే వాటిలో చిక్కదనం కోసం కార్న్ ఫ్లోర్ ను ఎక్కువగా వాడతారు. అలాగే రుచి కోసం సార్ట్చ్, ఎమ్ఎస్ జి వంటి వాటిని వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఆకలిని నియంత్రించే లిప్టిన్ హార్మోన్ నియంత్రణను కోల్పోతుంది.
దీంతో ఆకలి విపరీతంగా పెరిగిపోతుంది. ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల క్రమంగా ఊబకాయం బారిన పడతారు. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇన్సులిన్ నిరోధకత తెలుత్తుతుంది. టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక సాధ్యమైనంత వరకు బయట లభించే ఇన్ స్టాంట్ సూప్ లను వాడకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లోనే సహజంగా లభించే పదార్థాలతో సూప్ ను తయారు చేసి తీసుకోవడం మంచిది. పాలక్ సూప్, టమాట సూప్, స్వీట్ కార్న్ సూప్, బీన్స్ సూప్, పుదీనా సూప్, కొత్తిమీర సూప్ వంటి వాటిని తయారు చేసి తీసుకోవాలి. ఇలా ఇంట్లోనే సూప్ లను తయారు చేసి భోజనానికి అరగంట ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.